ఉల్లి ధరల శరాఘాతం

గతకొద్ది వారాలుగా ఉల్లి ధరలు వేగంగా పెరిగాయి. కిలో రూ. 60లు దాటి, కొన్ని ప్రాంతాల్లో రూ. 80ల స్థాయిని కూడా అధిగమించాయి. ఇవి వంద రూపాయల స్థాయిని కూడా దాటుతాయేమోననే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవలనే అల్లం ధర కిలో రూ. 200 దాటింది. కూరగాయల ధరలు కూడా కిలో 30 నుండి 80 రూపాయల మధ్య ఉండడం గమనిస్తున్నాం. మార్కెట్లో సన్నబియ్యం ధరలు రూ. 50లు దాటాయి. మాంసాహారాలైన కోడిమాంసం, వేట మాంసం, చేపలు, రొయ్యల ధరలు సామాన్యుడి అందుబాటుకి లేకుండా పోతున్నాయి. మొత్తంమీద ఆహారద్రవ్యోల్బణం రిటైల్ స్థాయిలో పదిశాతాన్ని దాటింది.‘ఉల్లి’ ప్రత్యేక స్థానం

                ఉల్లిధరలు బాగా పెరిగినప్పుడు ప్రజలు కోపంతో అధికారపక్షాలను ఎన్నికల్లో ఓడించిన కొన్ని దాఖలాలున్నాయి. మరోమారు అలాంటి పరిణామాలేర్పడతాయని విశ్లేషకులు, విపక్షనేతలు భావిస్తున్నారు. కొద్ది మాసాల్లో కొన్ని రాష్ట్ర అెనంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. దేశరాజధాని ఢిల్లీలో కూడా ఎన్నికల వేడి రాజుకుంటున్నది. అధికార పార్టీ వాళ్ళు కిలో ఉల్లి గడ్డలను రూ. 50లకు అమ్ముతుంటే, ప్రధాన ప్రతిపక్షపార్టీ రూ. 25లకే అమ్ముతూ ప్రజల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నది.

                ‘ఉల్లి చేనిన మేలు తల్లి కూడా చేయదు’ అనే నానుడి ప్రజల్లో బలంగా ఉంది. పోషక విలువలతోపాటు ఆహారానికి రుచిని కూడా కల్పించే ఉల్లిని చాలామంది మక్కువగా తింటారు. ఉల్లి, వెల్లుల్ని తామసగుణకారకాలని కొన్ని మతాలవాళ్ళు, శాఖల వాళ్ళు వాటి జోలికి పోరు. అలా కొన్ని లక్షల కుటుంబాలను మినహాయించినా దేశంలోని 120 కోట్ల జనాభాలో 98 శాతం మంది ఉల్లిని వాడుతుంటారు. వివిధ ప్రాంతాల్లో ఉండే ఆహారపు అలవాట్లను బట్టి ఒక్కో వ్యక్తి సంవత్సరానికి ఐదు నుండి ఇరవై కిలోల వరకు ఉల్లిని వాడుతున్నారు. సగటున మనిషికి నెలకు ఒక కిలో ఉల్లిపాయలు అవసరం. సంవత్సరానికి 12 కిలోల చొప్పున 120 కోట్ల జనాభాకి 14.4 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉల్లిగడ్డలు అవసరమౌతాయి.

ఉల్లి ఉత్పత్తి అంచనాలు

                ప్రపంచ వ్యాప్తంగా ఉల్లి పంట నాలుగు మిలియన్ హెక్టార్లలో సాగువుతున్నది. హెక్టారుకి 19 టన్నుల సగటు ఉత్పాదకతో 76 మిలియన్ టన్నుల ఉల్లి పంట పండుతున్నది. మనదేశంలో 1.1 మిలియన్ హెక్టార్లలో ఉల్లి పంట సాగవుతున్నది. కాని ఉత్పాదకత హెక్టారుకి 14.2 టన్నులు మాత్రమే ఉండటం వల్ల సాలీనా 15.2 మిలియన్ టన్నుల దిగుబడి మాత్రం లభిస్తోంది. మన పొరుగు దేశం చైనాలో ఉల్లి పంట విన్తీర్నం 0.93 మిలియన్ హెక్టార్లుగా ఉంది. కాని హెక్టారుకి 22 టన్నుల ఉత్పాదకతను సాధించి 20.5 మిలియన్ టన్నుల ఉత్పత్తితో అగ్రస్థానంలో ఉంది. శీతల వాతావరణం, నీటి వసతి ఎక్కువగా ఉండటం వల్ల, చైనా అధిక దిగుబడుల్ని సాధించి, ప్రపంచ ఉల్లి ఉత్పత్తిలో 27 శాతం వాటా కలిగి ఉంది. విన్తీర్ణంలో ప్రథమ స్థానంలో ఉన్నా దిగుబడులు తక్కువ కావటం వల్ల మనదేశానికి 20 శాతం వాటా మాత్రమే ఉంది. టర్కీ 2.5 శాతం వాటాతో, పాకిస్తాన్ 2.3 శాతం వాటాతో, బ్రెజిల్ 2.1 శాతం వాటాతో, రష్యా 2.0 శాతం వాటాతో తర్వాతి స్థానాలను ఆక్రమిస్తున్నాయి. మయన్మార్, బంగ్లాదేశ్‌లు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉల్లిని ఉత్పత్తి చేస్తున్నాయి. ప్రపంచ జనాభాలో ఆరవవంతు ప్రజలు భారత దేశంలో ఉన్నారు. ప్రపంచ ఉల్లి ఉత్పత్తిలో ఐదవ వంతు మన దేశం నుండి లభిస్తున్నది. అందుకే కొద్ది మోతాదులో మన దేశం నుండి ఉల్లిని ఎగుమతి చేయగలుగుతున్నాం.

ఎగుమతి సామర్థ్యం

                దేశీయ అవసరాలకుపోను ఎంతవరకు మనం ఉల్లిగడ్డలను ఎగుమతి చేయగలం అనేది మన ముందున్న సమస్య. దాదాపు రెండు మిలియన్ టన్నుల ఉల్లిపాయలను మన దేశం గరిష్ఠంగా ఎగుమతి చేనింది. 201011లో మనదేశంలో 15.75 మిలియన& టన్నుల ఉల్లిగడ్డలను ఉత్పత్తి చేనినట్లు అంచనా వేశారు. జాతీయ నమూనా సర్వే సంస్థ అంచనాల ప్రకారం మన దేశీయ అవసరాలు కూడా 15.72 మిలియన్ టన్నులే. ప్రత్యక్షంగా దేశంలోని వినిమయదారులు తమ ఇళ్ళలో వాడేది 11 మిలియన్ టన్నులనీ, హోటళ్ళు, ప్రాెననింగ్ పరిశ్రమలు పరోక్షంగా వాడేది 4.71 మిలియన్ టన్నులని ఆ సంస్థ అంచనా వేనింది. ఈ లెక్కల ప్రకారం మన దేశానికి ఎగుమతి సామర్థ్యం లేదు. కాని ఈ అంచనాలతో వ్యాపార వర్గాలు ఏకీభవించటం లేదు. అసలు ఎగుమతులు లేకుంటే దేశీయ ఉల్లి మార్కెట్లో మాంద్యం నెలకొని, ధరలు తగ్గిపోతున్నాయి. కాని ఎగుమతులు జరుగుతున్నప్పుడు పంట దిగుబడులు తగ్గితే ధరలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి.

ఉల్లిధరల్లో భారీ వ్యత్యాసాలు

                ఒక్కోసారి ఉల్లిగడ్డ ధర కిలో ఐదారు రూపాయలకు పడిపోతుంది. మరోసారి రూ. 80లు దాటుతుంది. ఇంత భారీ వ్యత్యాసాలుండటానికి గిరాకీసరఫరాల మధ్య ఉండే వ్యత్యాసాలు కొంత కారణమైతే వ్యాపారుల అధిక లాభాపేక్షతో సరుకుని దాచి కృత్రిమ కొరత సృష్టించడం మరో కారణం. మనదేశంలో ఉల్లి ఉత్పత్తిలో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. మూడు లక్షల ఏభై తొమ్మిది వేల హెక్లార్లలో ఉల్లిని సాగు చేస్తూ, ఐదు మిలియన్ టన్నుల ఉత్పత్తిని ఆ రాష్ట్రం సాధిస్తోంది. అంటే దేశవ్యాప్తంగా ఉల్లి పంటలో దాదాపు మూడవ వంతు ఉత్పత్తి మహారాష్ట్రదే. 2.72 మిలియన్ టన్నుల ఉత్పత్తితో కర్ణాటక ద్వితీయ స్థానంలో ఉంది. ఆ తర్వాత వరసగా గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో ఉన్నాయి. ఆ తర్వాత 48,500 హెక్టార్ల నుండి 82,480 టన్నుల ఉల్లి ఉత్పత్తితో ఆరో స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది.

                ఉల్లి పంట సంవత్సరంలో మూడుసార్లుగా మార్కెట్‌కి వస్తున్నది. తొలి ఖరీఫ్ పంట ఆగస్టు, ెనప్టెంబరు నెలల్లో, మలి ఖరీఫ్ పంట అక్టోబరు, నవంబరు నెలల్లో, రబీ పంట ఫిబ్రవరి, మార్చి నెలల్లో వస్తుంది. ఈ ఆరు నెలల్లో వచ్చే పంటను ఆరబెట్టి, నిలువ చేని మిగిలిన ఆరు నెలల కాలంలో వాడుకోవాలి. నిలువ చేనినప్పుడు కొంత పంట కుళ్ళిపోయి, రోగాల బారినపడి చెడిపోతుంది. పది నుండి ఇరవై శాతం పంట ఇలా నష్టపోవటం మామూలే. మెరుగైన నిలువ పద్ధతులలో పెట్టుబడులు పెడితే ఈ నష్టాలను కొంత మేరకు తగ్గించవచ్చు.

ఉత్పత్తి వ్యయం  ధర

                ఉల్లిగడ్డల ఉత్పత్తి వ్యయాన్ని అంచనా వేయటానికి కొన్ని శాన్ర్తీయ అధ్యయనాలు జరిగాయి. మహారాష్ట్రలో 201112 సంవత్సరంలో చేనిన ఒక అధ్యయనంలో ఉల్లి ఉత్పత్తి వ్యయం క్వింటాల్‌కి తొలి ఖరీఫ్ పంటలో రూ. 497లు గానూ, మలి ఖరీఫ్ పంటలో రూ. 346లు గానూ, రబీ పంటలో రూ. 352 గానూ అంచనా వేశారు. గత రెండు సంవత్సరాల్లో ఉత్పత్తి వ్యయం 20% పెరిగి ఉండవచ్చు. ఇప్పుడు ఉత్పత్తి వ్యయం కిలోకి నాలుగున్నర రూపాయల నుండి ఆరు రూపాయల వరకు చేరి ఉండవచ్చు. రైతులకు ఏభైశాతం లాభం వేన్త ఫర్వాలేదనుకుంటే గిట్టుబాటు ధర కిలోకి రూ. 7 ల నుండి రూ. 9లకు చేరుతుంది. మార్కెటింగ్ ఖర్చులు, నిలవ ఖర్చులు, కుళ్ళిన పాయల వల్ల వచ్చే నష్టాలను కలిపితే కిలో ఉల్లి ధర రూ. 10 నుండి రూ. 14ల వరకు చేరుతుంది. వ్యాపారుల లాభాలు కలుపుకున్నా వినిమయదారుడికి రూ. 12 నుండి రూ. 17 ల మధ్య వివిధ నెలల్లో అందించవచ్చు. కాని మార్కెట్ ధరలనలా న్యాయబద్ధంగా నిర్ణయించి, అమలు పరిచే వ్యవస్థ ఏదీ లేదు.

                200910, 201011 సంవత్సరాల్లో ఉల్లి ధరలు బాగా పెరిగాయి. ఎగుమతులకు ప్రపంచ మార్కెట్లో గిరాకీ ఎక్కువ అవడం వల్ల ధరలు కిలో ఒకటికి రూ. 50లను దాటింది. ప్రపంచ మార్కెట్లో ఉల్లి పాయల ధర టన్నుకి 500 డాలర్లు దాటింది. ఆ పరిన్థితుల్లో ప్రభుత్వం ఉల్లి ఎగుమతుల్ని తాత్కాలికంగా నిషేధించింది. ఫలితంగా 201112 సంవత్సరంలో ఉల్లి ధరలు తగ్గాయి. ప్రపంచ మార్కెట్లో కూడా టన్ను ధర 125 డాలర్లకు తగ్గింది. మళ్ళీ 201213 సంవత్సరంలో ఉల్లిధరలు పెరిగాయి. 201314 సంవత్సరం ప్రారంభమయ్యేటప్పటికి ఉల్లి ధరలు మరింత వేగాన్ని పుంజుకున్నాయి.

ఎగుమతులపై నియంత్రణ

                పెరుగుతున్న ఉల్లి ధరల్ని అదుపు చేయటానికి భారత ప్రభుత్వం ఉల్లి కనీస ఎగుమతి ధరను టన్నుకి రూ. 40,000గా నిర్ణయించింది. ఇటీవలి వరకు హోల్‌ేనల్ (టోకు) మార్కెట్లలో ధర టన్నుకి రూ. 47,500 వరకు ఉంది. అప్పుడు ఎగుమతులు కొంతవరకు కొనసాగాయి. కాని కొత్త పంట టోకు ధరలు టన్నుకి రూ. 32,500కి పడిపోయాయి. ఎగుమతులు సహజంగానే ఆగిపోయాయి. రిటైల్ ధరలు కొంత తగ్గుముఖం పట్టాయి.

                ఉల్లి ధరల నియంత్రణ కత్తిమీద సాము వంటిది. ఉల్లి ధరల్ని కిలోకి రూ. 16 నుండి రూ. 25ల మధ్య నిలపగలిగితే రైతుకి, వ్యాపారులకి, వినిమయదారులకూ న్యాయబద్ధంగా ఉంటుంది. ఎగుమతులు పూర్తిగా ఆగిపోయి, రిటైల్ ధరలు కిలోకి పది రూపాయలకు చేరితే ఉల్లి రైతులు నష్టపోతారు. ఎగుమతులు రెండు మిలియన్ టన్నుల స్థాయికి చేరితే ధరలు కిలోకి రూ. 30లను దాటుతాయి. పంట వచ్చే ముందు ధరలు భారీగా పెరుగుతుంటాయి. ఈ పరిన్థితుల్ని ఎదుర్కోవటానికి ప్రభుత్వాలు కొన్ని నిల్వల్ని అధునాతన సౌకర్యాలతో నిర్వహిేన్త మంచిది. అప్పుడు వ్యాపారుల అధిక లాభాపేక్షకు అడ్డుకట్ట వేయవచ్చు.

                కనీస ఎగుమతి ధరను పరిన్థితిని బట్టి టన్నుకి రూ. 20,000ల నుండి రూ. 40,000ల మధ్య నిర్ణయిస్తూ, మారుస్తూ ఉండాలి. ఎగుమతుల్ని పూర్తిగా నిషేధించకూడదు. ఒక మిలియన్ టన్నుల స్థాయి కన్నా ఎగుమతులు పెరిగితే కనీస ఎగుమతి ధరను రూ. 20,000 నుండి రూ. 40,000 పెంచుకుంటూ పోవాలి. పంట దిగుబడులు తగ్గినప్పుడు దిగుమతుల్ని ప్రోత్సహించాలి. ఎలాగైనా ఉల్లి ధరలు కిలోకి రూ. 40ల కన్నా పెరగకుండా చూడాలి. నియంత్రణ కోల్పోయి ధరలు రూ. 80లకు చేరితే ప్రజాగ్రహం ప్రభుత్వాలనే కూల్చవచ్చు. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల మధ్య సమన్వయం అవసరం.

  డా. కిలారు పూర్ణచంద్రరావు

ప్రముఖ వ్యవసాయార్థిక శాస్త్రవేత్త,

Rythunestham

Editor :Venkateswara Rao
Ritunestham - Agricultural Monthly Magazine

No comments:

Post a Comment